మత్తయి 9:18-26

మత్తయి 9:18-26 TELUBSI

ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ. –నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి –కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి. –స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.