మత్తయి 6:5-14

మత్తయి 6:5-14 TELUBSI

మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.