మత్తయి 4:12-22

మత్తయి 4:12-22 TELUBSI

యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. – జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.) అప్పటినుండి యేసు పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.