మత్తయి 27:32-66

మత్తయి 27:32-66 TELUBSI

వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. –ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్నవారిలో కొందరామాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు–ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధి పతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరి యయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి –అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి –ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు–కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.