మత్తయి 26:20-54

మత్తయి 26:20-54 TELUBSI

సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను. వారు భోజనముచేయుచుండగా ఆయన–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను. వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి –మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి–దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా– గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెదననెను. అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి. అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి–నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి, సాగిలపడి– నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి–బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.