మత్తయి 26:1-35

మత్తయి 26:1-35 TELUBSI

యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి –రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు–పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. శిష్యులు చూచి కోపపడి–ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలిసి కొని–ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి –నేనాయ నను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి–పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి. అందుకాయన–మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతోకూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను. వారు భోజనముచేయుచుండగా ఆయన–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యిముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను. వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి –మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి–దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి. అప్పుడు యేసు వారిని చూచి–ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా– గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెదననెను. అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.