మత్తయి 26:1-13

మత్తయి 26:1-13 TELUBSI

యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి –రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు–పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. శిష్యులు చూచి కోపపడి–ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలిసి కొని–ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.