మత్తయి 25:20-40

మత్తయి 25:20-40 TELUBSI

అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి – అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి –ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.