మత్తయి 24:1-22

మత్తయి 24:1-22 TELUBSI

యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన – మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములనుగూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే – చదువువాడు గ్రహించుగాక– యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; పొలములోఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.