మత్తయి 21:12-32

మత్తయి 21:12-32 TELUBSI

యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి– నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, –దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి –వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు– వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా – యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆప్రకారమే చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను. అందుకు వారు–మొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి.