మత్తయి 20:20-28

మత్తయి 20:20-28 TELUBSI

అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా –నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు–త్రాగగలమనిరి. ఆయన –మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.