రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి –యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని – మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. వారు వెళ్లినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై–హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
Read మత్తయి 2
వినండి మత్తయి 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 2:1-16
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు