మత్తయి 18:15-35

మత్తయి 18:15-35 TELUBSI

మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి– ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను–ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి–నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని–నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి–నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి –చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీయెడల చేయుననెను.