మత్తయి 15:1-20

మత్తయి 15:1-20 TELUBSI

ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? –తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. మీరైతే– ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి –నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా – ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.