మత్తయి 14:8-21

మత్తయి 14:8-21 TELUBSI

అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై–బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయ మని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు– ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.