మత్తయి 14:1-14

మత్తయి 14:1-14 TELUBSI

ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని –ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచియున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా–నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. అతడు ఇతని చంప గోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై–బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.