ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి –అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. –ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు –వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలము లోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్య సంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజమందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
Read మత్తయి 13
వినండి మత్తయి 13
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 13:24-58
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు