ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను –పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
చదువండి మత్తయి 13
వినండి మత్తయి 13
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 13:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు