మత్తయి 12:33-40

మత్తయి 12:33-40 TELUBSI

చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు–బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. –వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును.