అప్పుడు దయ్యముపెట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరు విస్మయమొంది –ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు–బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. –వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డైవెన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.
చదువండి మత్తయి 12
వినండి మత్తయి 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 12:22-45
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు