మత్తయి 12:1-21

మత్తయి 12:1-21 TELUBSI

ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులదిచూచి– ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను–తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతోకూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు–కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దో షులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను. ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను. వారాయనమీద నేరము మోపవలెనని–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యు నితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి. యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా – ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను నదే.