వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను –మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో–సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.– ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. వినుటకు చెవులుగలవాడు వినుగాక. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి– మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని వారనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక–ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. –అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీమధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
చదువండి మత్తయి 11
వినండి మత్తయి 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 11:7-30
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు