ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు– ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పెట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను. అందుకు యేసు –విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన–ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి. –ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను. యోహాను–ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను. అందుకు యేసు – మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి–ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
చదువండి లూకా 9
వినండి లూకా 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 9:28-56
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు