ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. –నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా వారు– బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు– ఏలీయాయనియు, కొందరు– పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు–నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన –ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను –ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు– ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.
చదువండి లూకా 9
వినండి లూకా 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 9:18-36
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు