లూకా 9:10-17

లూకా 9:10-17 TELUBSI

అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి–మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపెట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. ఆయన–మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు–మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చినవారు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు. ఆయన–వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరుతిని తృప్తి పొం దిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.