లూకా 8:5-15

లూకా 8:5-15 TELUBSI

–విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు–వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు–ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా ఆయన–దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి.) ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును. రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.