లూకా 8:40-48

లూకా 8:40-48 TELUBSI

జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీదపడి యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తనయొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి. అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్ర్తీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. –నన్నుముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును–మేమెరుగమన్నప్పుడు, పేతురు–ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను. తాను మరుగై యుండలేదని, ఆ స్ర్తీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. అందుకాయన–కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.