మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందునవారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడాయన –మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి–ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.
వారు గలిలయకు ఎదురుగాఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపెట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి–యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను. ఏలయనగా ఆయన–ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు–నీ పేరేమని వానినడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచినవారు దయ్యములు పెట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతోకూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన–నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.
జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీదపడి యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తనయొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్ర్తీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. –నన్నుముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును–మేమెరుగమన్నప్పుడు, పేతురు–ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా యేసు–ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను. తాను మరుగై యుండలేదని, ఆ స్ర్తీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను. అందుకాయన–కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.
ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాటవిని–భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో –ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని –చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగివచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన –ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన– జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.