లూకా 6:37-49

లూకా 6:37-49 TELUBSI

తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను–గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో–సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.