ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లు చుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు–విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా యేసు వారితో ఇట్లనెను–తానును తనతోకూడ ఉన్నవారును ఆకలిగొని నప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైనను మీరు చదువ లేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతోకూడ ఉన్నవారికిని ఇచ్చెను గదా అనెను. కాగా–మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.
మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను. శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితో– నీవు లేచిమధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు–విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరిని చుట్టు కలయజూచి–నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెఱ్ఱి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా–ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితోకూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్పసమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి. ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నముచేసెను.
అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను–
బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.