లూకా 5:17-39

లూకా 5:17-39 TELUBSI

ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతోకూడ యేసు ఎదుట వారిమధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి–మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రులును పరిసయ్యులును–దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? –నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? –నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి–నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి–సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. వారాయనను చూచి–యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరి సయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు–పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా– ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.