లూకా 5:17-26

లూకా 5:17-26 TELUBSI

ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతోకూడ యేసు ఎదుట వారిమధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి–మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రులును పరిసయ్యులును–దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? –నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? –నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి–నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.