లూకా 5:1-11

లూకా 5:1-11 TELUBSI

జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి, ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి– దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత–నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలుమునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితోకూడనున్నవారందరును విస్మయమొందిరి. ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు–భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.