లూకా 4:33-44

లూకా 4:33-44 TELUBSI

ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపెట్టిన వాడొక డుండెను. వాడు–నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు–ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను. అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి. అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు–నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా ఆయన–నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.