లూకా 4:14-36

లూకా 4:14-36 TELUBSI

అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి–ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి–వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములోనుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను. అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతోకూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపెట్టిన వాడొక డుండెను. వాడు–నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు–ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను. అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.