లూకా 4:1-21

లూకా 4:1-21 TELUBSI

యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది–నీవు దేవుని కుమారుడ వైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అందుకు యేసు –మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి –ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి–నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు –నీ దేవుడైన ప్రభువు ను శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.