లూకా 23:36-46

లూకా 23:36-46 TELUBSI

అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి –నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. –ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి–యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.