లూకా 19:11-27

లూకా 19:11-27 TELUBSI

వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి–నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి–ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన యెదుటికి వచ్చి–అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా అతడు–భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అంతట రెండవవాడు వచ్చి–అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. అంతట మరియొకడు వచ్చి–అయ్యా, యిదిగో నీ మినా; నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడుచెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి –వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను. వారు–అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి. అందుకతడు–కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.