లూకా 17:5-19

లూకా 17:5-19 TELUBSI

అపొస్తలులు–మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు–మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు–నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక–నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత – మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయలమధ్యగా వెళ్లుచుండెను. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి –నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.