లూకా 17:1-10

లూకా 17:1-10 TELUBSI

ఆయన తన శిష్యులతో ఇట్లనెను–అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగి–మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను. అపొస్తలులు–మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు–మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు–నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక–నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత – మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.