లూకా 13:22-35

లూకా 13:22-35 TELUBSI

ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను. ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి–నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి– ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవదినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.