లూకా 12:35-59

లూకా 12:35-59 TELUBSI

మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు–ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా ప్రభువు ఇట్లనెను–తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు–నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపకఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను. నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు; భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను– మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు –వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల? వాదించువానితోకూడ అధికారియొద్దకు నీవు వెళ్లుచుండగా అతనిచేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము, లేదా, అతడొకవేళ నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాననెను.