లూకా 11:1-23

లూకా 11:1-23 TELUBSI

ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రాౖర్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు– ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను–మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి–స్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనేయుండినన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.