ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునోవాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి–మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి– బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అందు కాయన–ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా అతడు–నీ దేవుడైన ప్రభువు ను నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను. అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు–అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగెను. అందుకు యేసు ఇట్లనెను–ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి–ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు–అతనిమీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు–నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.
అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్ర్తీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు –మార్తా, మార్తా, నీవనేకమైన పనులనుగూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.