లూకా 10:1-23

లూకా 10:1-23 TELUBSI

అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడాయన వారితో ఇట్లనెను–కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు–ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి–దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినయెడల మీరు దాని వీధులలోనికి పోయి–మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును. ఓ కపెర్నహూమా, ఆకా శము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి –ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన–సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో పాము లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి–తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునోవాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి–మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి