లూకా 1:68-79

లూకా 1:68-79 TELUBSI

ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్య మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను.