ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచె నని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతోకూడ సంతోషించిరి. ఎనిమిదవదినమునవారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి–ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు–నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని–వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందునుబట్టి వారి చుట్టుపెట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినినవారందరును –ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైయిట్లు ప్రవచించెను – ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్య మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను. శిశువు ఎదిగి, ఆత్మయందు బలముపొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.
చదువండి లూకా 1
వినండి లూకా 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 1:57-80
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు