లూకా 1:34-45

లూకా 1:34-45 TELUBSI

అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను – స్ర్తీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.