లేవీయకాండము 16:1-14

లేవీయకాండము 16:1-14 TELUBSI

అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను –నేను కరుణాపీఠముమీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనములమీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.