యెహోషువ 6:15-20

యెహోషువ 6:15-20 TELUBSI

ఏడవదినమునవారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు. శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.